తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. పోలీస్ ఈవెంట్స్‌లో నిబంధనలు సడలించాలని అభ్యర్థులు కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయితే దీనిపై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని… పోలీసు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను సవరించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బండి సంజయ్ విమర్శించారు.
శరీర దారుఢ్య పరీక్షల నిబంధనలను వెంటనే సరిదిద్దాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో ఏ రాష్ట్రంలోనూ లేని నిబంధనలను పొందుపరిచారని అన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో కూడా ఈ స్థాయిలో నిబంధనలు లేవని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు ఉండగా తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించారని విమర్శించారు. 4 మీటర్లుగా నిర్ణయించడం వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిబంధనలను మార్చాలని… లేకపోతే ప్రభుత్వాన్ని యువత క్షమించదని బండి సంజయ్ చెప్పారు.