ఉద్యోగ ఖాళీల భర్తీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. 8 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో కేవలం పోలీస్ ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నారని.. మిగతా 63,425 పోస్టుల సంగతేంటని బండి సంజయ్ లేఖలో ప్రశ్నించారు. ఇతర శాఖల్లో ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. మీ పాలనకు అడ్డు రాకూడదనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఒక్కో నిరుద్యోగికి రూ. 1.20 లక్షల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి 45 రోజులు కావస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని… చాలా పాఠశాలల్లో టీచర్లు లేక విద్యా వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందని… రాష్ట్ర ప్రభుత్వం ముందుగా టీచర్ల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. 63,425 పోస్టుల భర్తీ ఎప్పుడు చేపడుతారో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ పార్టీ తరుపున బండి సంజయ్ డిమాండ్ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని… మీ కుటుంబంలో ఐదుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని… నిరుద్యోగ యువకులకు రూ. 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని.. మూడున్నరేళ్లు కావస్తున్నా… ఇంకా హామీని అమలు చేయలేదని లేఖలో విమర్శించారు.