కేసీఆర్ పై దండయాత్రలకు … వరుసగా ‘ బండి ‘ యాత్రలు ?

-

తెలంగాణ బీజేపీ నేతలు చాలా కసి మీద ఉన్నారు. 2014 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నా టిఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో ఆ అవకాశం దక్కకుండా చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలనే విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పార్టీ నాయకులంతా సమిష్టిగా పోరాడుతూ కెసిఆర్ హవాను తెలంగాణలో తగ్గించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ప్రజలలో బలం పెంచుకునేందుకు, అధికారం దిశగా అడుగులు వేసేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తూ, బీజేపీ నేతలు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో చాలా స్పీడ్ గా వ్యూహాలు రచించుకుంటూ ముందుకు కదులుతున్నారు. దీనికోసం గత నుంచి హిట్ అవుతూ వస్తున్న యాత్రల ఫార్ములాను బండి సంజయ్ బయటకు తీశారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేపట్టి ఆ తరువాత అధికారంలోకి వచ్చారు. అలాగే ఆయన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఇదే విధంగా పాదయాత్రను నమ్ముకుని ఆ తరువాత అధికారంలోకి వచ్చారు. ఏపీ సీఎంగా ఉన్న జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేపట్టి ప్రజలలో మరింతగా ఆదరణ పొంది అధికారాన్ని సంపాదించుకోగలిగారు.

ఇలా ఎలా చూసుకున్నా, పాదయాత్రల ఫార్ములా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్కవుట్ అవుతూనే వస్తోంది. ఇక తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి వస్తే పాదయాత్ర చేపడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి వంటివారు ఇప్పటికే ప్రకటించేశారు. వీరి సంగతి ఇలా ఉంటే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు మాత్రం ఇప్పడు  సరికొత్త రీతిలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర ద్వారా అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ముందుగా బస్సు యాత్ర చేపట్టి , ఆ తర్వాత పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఢిల్లీ పెద్దలు సైతం ఈ యాత్రలకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఉండడంతో పాటు, 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బస్సు యాత్ర, తరువాత పాదయాత్ర చేయడం ఒక్కటే మార్గం గా సంజయ్ ఓ నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అవుతుండడంతో త్వరలోనే ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించేందుకు సంజయ్ సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ యాత్రల ముఖ్య ఉద్దేశం అంతా కేసీఆర్ హవాను తెలంగాణాలో తగ్గిస్తూ, ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతను పెంచడమే ఏకైక లక్ష్యంగా సంజయ్ ప్లాన్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news