ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు ముగిశాయి. రెండు రోజుల పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డాను తిరిగి నియమించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. మోడీ స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. తెలంగాణలో రామరాజ్యం స్థాపన చేస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో మోడీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని, యాత్రకు సంధించిన ఫీడ్ బ్యాక్ ఆయన వద్ద ఉందని తెలిపారు.
పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న బీజేపీ కార్యకర్తలను ప్రధాని మోడీ అభినందించారని చెప్పారు. మోడీ ఇచ్చిన జోష్ తో రాష్ట్రంలో మరింత ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాయకత్వంలోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ తమను ఆదేశించారని చెప్పారు. రాష్ర్టాన్ని దోపిడీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశాన్ని కూడా దోపిడీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆరోపించారు. ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా కల్వకుంట్ల కుటుంబం ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.