కన్నఊరు విడిచినోళ్లు కన్నీరు పెడుతుండ్రు : బండి సంజయ్

-

కేసీఆర్‌ బస్వాపూర్‌ జలాశయం గుత్తేదారులకు రూ.వేల కోట్లు చెల్లిస్తూ నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ‘ప్రాజెక్టులు కడితే రైతులు సంతోషపడాలి. కానీ, భూములు కోల్పోయిన అన్నదాతలు ఏడుస్తున్నారు. పరిహారం ఇవ్వడం లేదని కన్న ఊరు విడిచినోళ్లు కన్నీరు పెడుతుండ్రు. కేసీఆర్‌ మాత్రం కనికరించడంలేదు. ఆయన పాపం ఊరికేపోదు’ అని అన్నారు.

సంజయ్‌ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర రెండోరోజు బుధవారం భువనగిరి మండలం బస్వాపూర్‌ గ్రామంలోని నృసింహసాగర్‌(బస్వాపూర్‌) జలాశయం ముంపు బాధితుల రచ్చబండతో ప్రారంభమైంది. తొలుత నిర్వాసితుల గోడు విన్న ఆయన  మాట్లాడుతూ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ లాగా కేసీఆర్‌ డూప్‌ ఇంజినీర్‌ అవతారమెత్తి కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండాముంచారని ధ్వజమెత్తారు.

‘ఎవరూ అధైర్యపడొద్దు. భూనిర్వాసితులకు న్యాయం జరిగేవరకు ఏ పోరాటానికైనా సిద్ధమే’ అని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రమంతటా తక్కువలో తక్కువ రూ.50 లక్షలకు ఎకరం ధర పలుకుతుందని చెప్పిన కేసీఆర్‌ హైదరాబాద్‌ సమీపంలో ఉన్న బస్వాపూర్‌ నిర్వాసితులకు ఆ పరిహారం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. ఓట్ల కోసం, పదవుల కోసం మీ దగ్గరకు రాలేదు. ఊరూరా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ప్రధాని పంపిస్తే వచ్చా’నని సంజయ్‌ చెప్పారు.

నృసింహసాగర్‌ బాధితులందరికీ ఒకేసారి పరిహారంతోపాటు ఇల్లుకు ఇల్లు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.  పల్లెల్లో అభివృద్ధి పనులు మోదీ ఇచ్చిన నిధులతోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంతో పాటు బస్వాపూర్‌ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల వివరాలను గణాంకాలతో వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version