రాజకీయాల్లో పాదయాత్రకు చాలా విలువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండే నాయకులు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆనవాయితీగా మారింది. ఈ పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తారు. ఇదే సమయంలో అధికారపక్షం కాస్త ప్రజలకు దూరమవుతుంది. అదే ప్రతిపక్ష నాయకులకు అడ్వాంటేజ్ అవుతుంది. సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తారా.
గతంలో వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసే, తర్వాత అధికారంలోకి రాగలిగారు. అలాగే ఉమ్మడి ఏపీలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేసి, నెక్స్ట్ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. ఇక ఏపీలో జగన్ సైతం అదే బాటలో వెళ్లారు. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేశారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేశారు.
అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు పాదయాత్ర చేయలేదు. దీంతో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కానీ ఈసారి కేసీఆర్‌కు అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ పాదయాత్ర చేపట్టాలని గతంలోనే సంజయ్ భావించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అది కుదరలేదు.
అయితే వచ్చే నెల నుంచి సంజయ్ యాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి సైతం గతంలో పాదయాత్ర చేయాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఉండే విభేదాల వల్ల రేవంత్‌కు అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి తానే పీసీసీ అధ్యక్షుడుగా ఉండటంతో తప్పనిసరిగా రేవంత్ పాదయాత్ర చేయడం ఖాయమని తెలుస్తోంది. పరిస్థితులని బట్టి త్వరలోనే రేవంత్ సైతం ప్రజల మధ్యలోకి రానున్నారని తెలుస్తోంది.