ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఆయన ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. అయితే అత్యుత్తమ బ్యాంకర్గా ఆయన సెలెక్ట్ అవ్వడం వరుసగా ఇది రెండో సారి. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో శక్తికాంత దాస్‌కు ‘ఏ+’ రేటింగ్ లభించిందని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆర్‌బీఐ షేర్ చేసింది.
ఏ+ రేటింగ్‌ను ప్రపంచంలో ముగ్గురు కేంద్ర బ్యాంక్ గవర్నర్‌లకు ఇచ్చారు. అందులో శక్తికాంత దాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. A+ రేటింగ్ పొందిన కేంద్ర బ్యాంకర్లలో రెండో స్థానంలో డెన్మార్క్‌కు చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్సన్, మూడో స్థానంలో స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జే జోర్డాన్ ఉన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా కేంద్ర బ్యాంకుల గవర్నర్లకు A నుంచి F వరకు గ్రేడ్‌లు కేటాయిస్తారు. అద్భుత పనితీరుకు A, అధ్వాన పనితీరుకు F రేటింగ్ ఇస్తారు. ఇక అత్యద్భుత పర్ఫామెన్స్కు A+ రేటింగ్ ఇస్తారు.