పన్ను ఎగవేత.. ఒప్పో, వివో, షావోమి కంపెనీలకు నోటీసులు

-

పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీలైన ఒప్పో, వివో, షావోమికి సంబంధించిన కేసులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పన్ను ఎగవేతలపై ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ అనుబంధ ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.

కస్టమ్స్‌ డ్యూటీ ఎగవేత కోసం వస్తువుల విలువను తక్కువగా చూపిన కారణంగా ఒప్పో కంపెనీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (DRI) నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం రూ.4,389 కోట్లు కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాలని నోటీసుల్లో పేర్కొనగా.. ఇందుకు గానూ ఆ కంపెనీ రూ.450 కోట్లు డిపాజిట్‌ చేసినట్లు చెప్పారు.

షావోమీ కంపెనీకి మూడు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సుమారు రూ.653 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా.. ఆ కంపెనీ రూ.46 లక్షలు మాత్రమే డిపాజిట్‌ చేసిందని చెప్పారు. పన్ను ఎగవేత విషయంలో వివో ఇండియాకు రూ.2,217 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులు పంపించగా.. రూ.60 కోట్లు డిపాజిట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కాకుండా తన మొత్తం టర్నోవర్‌లో రూ.62 వేల కోట్ల మేర విదేశాలకు తరలించినట్లు ఎదుర్కొంటున్న ఆరోపణలపై వివోపై ఈడీ దర్యాప్తు జరుపుతోందని మంత్రి వివరించారు. కస్టమ్స్‌ సుంకం ఎగవేత ఆరోపణలపై షావోమిపై 5 కేసులు నమోదైనట్లు తెలిపారు. 2019-2022 మధ్య కాలంలో ఇలాంటి మరో 43 ఇతర కంపెనీలపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ కేసులు నమోదు చేసిందని పార్లమెంట్‌కు మంత్రి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news