రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో ర్యాగింగ్ నిషిద్ధం అని.. ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నేడు విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు మంత్రి బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అధ్యాపకులకు దృష్టికి తీసుకురావాలన్నారు.
స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించామని తెలిపారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం విద్యకే తొలి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడమే తమ లక్ష్యం అన్నారు. వచ్చే ఏడాది నుంచి స్మార్ట్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయులకు అత్యున్నత శిక్షణ కోసం ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుక, యూనిఫాంలో మార్పులు చేస్తున్నట్లు వివరించారు.