తమ సమస్యల పరిష్కారాని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఈనెల 24 వరకు తమ సమస్యలు పరిష్కరించాలని లేనియెడల మళ్లీ ఆందోళన బాట పడతామని విద్యార్థులు ఇదివరకే హెచ్చరించారు. ఆర్జీయూకేటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని.. ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరిస్తామని ఇప్పటికే.. ఇంఛార్జ్ వీసీ వెంకట రమణ రాతపూర్వక హామీ ఇచ్చారు. ఇంతలోనే సెమిస్టర్ బ్రేక్ అంటూ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించారు.
అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. ఇటీవలే 600 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మరి ఈ సమావేశంలో తల్లిదండ్రులు ఏం ప్రశ్నిస్తారో.. వీసీ ఏం సమాధానమిస్తారో తెలియాల్సి ఉంది.
మరోవైపు.. శాశ్వత వీసీ నియామకం , పాత భోజనశాలలో టైల్స్, మురుగు కాలువలు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, తరగతి గదుల్లోని చిన్న చిన్న మరమ్మతులు, ఆరోగ్యకరమైన ఆహారం వంటి 12 డిమాండ్లు నెరవేర్చాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారంపాటు ఎండనక వాననక ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.