వంటల్లో వాడే ప్రతీ మసాల దినుసు కేవలం రుచిని, వాసననే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం. కానీ మనలో చాలామందికి వీటి గొప్పతనం తెలిసి ఉండదు. మసాల దినుసులకు మన దేశం పెట్టింది పేరు. అందరి వంటింట్లో ధనియాలు కచ్చితంగా ఉంటాయి. వీటిని పొడిగా చేసుకుని మనం వాడుతుంటాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఈరోజు ధనియాల గొప్పతనం చూద్దాం.
ధనియాల వల్ల కలిగే ప్రయోజనాలు..
మూర్ఛలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా ధనియాలు చక్కగా పనిచేస్తాయి.
మహిళలకు నెలసరి సమయంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం సమస్యను తగ్గించడంలో కూడా ధనియాలు సహాయపడతాయి. ధనియాల నీటిని తాగడం వల్ల రక్తస్రావం అదుపులో ఉంటుందట.
ధనియాలల్లో ఉండే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.
ధనియాలల్లో యాంటీ ఇన్‌ప్లామేటరీ లక్షణాలు ఉన్నందున ఇవి నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
దద్దుర్లు, దురదలు, వాపులను తగ్గించడంలో ధనియాలు ఎంతో సహాయపడతాయి. ఒక టీ స్పూన్ తేనెలో సగం టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై సమస్య ఉన్న ప్రాంతంలో రాసి.. కొంత సమయం తరువాత కడిగేయాలి.
బరువు తగ్గాలి అనుకునే వారికి ధనియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 3 టీస్పూన్ ల ధనియాలను కనీసం 3 గంటలు నీళ్లలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి సగం గ్లాసు నీళ్లు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రోజుకు రెండు సార్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.
ఆర్శమొలల సమస్యను తగ్గించటంలో ధనియాలో తోడ్పడతాయి. ధనియా మొక్కను శొంటిని కలిపి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ రసాన్ని తాగితే ఆర్శమెలలు తగ్గిపోతాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు తరచూ ధనియాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ధనియాల టీ, కషాయాన్ని తీసుకోవటం వల్ల హార్మోన్ల అసమతుల్యత నుండి బయట పడవచ్చు.
కంటి సమస్యలను తొలగించి, చూపును మెరుగుపరచడంలో ధనియాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. 20 గ్రాముల ధనియాల పొడిని ఓ గ్లాసు నీటిలో ఉడికించిన తరువాత వడ కట్టాలి. రసం చల్లారిన తరువాత ఒక్కో కంటిలో రెండు చుక్కల ఈ రసాన్ని వేయాలి. కంటి కళక, కంటి దురదలు, కళ్ల మంటలు, కళ్ల నుంచి నీరు కారడం లాంటి సమస్యలు తొలగి పోతాయి. అయితే ఇది ప్రయత్నించే ముందు అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
కీళ్ళనొప్పుల సమస్యలతో బాధపడేవారు ధనియాల నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకుని మర్ధన చేసుకోవటం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనియాలు రక్తంలో చక్కెర స్ధాయిలను తగ్గించటానికి సహాయపడతాయి. ప్యాంక్రియాటిక్ బీటా కణాలు మెరుగుపరిచి చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ధనియాలలో ఉండే లినూల్ అనే సమ్మేళనం ఆందోళన తగ్గించటంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్ధపై ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
– Triveni Buskarowthu