ఉత్తమ పురుష : వెల్డన్ కేసీఆర్ సర్ !

-

యుద్ధం చేసినా కూడా కొన్ని మారని ప‌రిణామాలున్నాయి. ఆ విధంగా కొన్ని సార్లు త‌గ్గి వెన‌క్కు వ‌చ్చి సానుకూల నిర్ణ‌యం తీసుకుంటే మంచి కాస్త ఎక్కువ మందికి జ‌రిగి తీరుతుంది. అంతేకాదు కొన్ని వ‌ర్గాలకు అభ్యున్న‌తి కూడా సిద్ధిస్తుంది. రైతు రాజు గా మారే త‌రుణాన్ని ప్రేమించే ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రు కేసీఆర్ అని త‌రుచూ తెలంగాణ రాష్ట్ర స‌మితి అంటోంది. ఆ మాట‌కు అనుగుణంగా రైతుకు కాస్తో కూస్తో కాదు ఎంతో మేలు చేసిన ప్ర‌భుత్వం త‌మదే అని ఎన్నో సార్లు ఉదాహ‌ర‌ణ స‌హితంగా చెప్పింది.

ఆ మాట‌కు అనుగుణంగా రెట్టించిన భ‌రోసా ను వారికి ఇస్తూ కేసీఆర్ నిన్న‌టి వేళ ఓ సానుకూల  నిర్ణ‌యం తీసుకున్నారు.అదే యాసంగి వ‌డ్లు కేంద్రం కొనుగోలుచేయ‌కున్నా తామే అందుకు సిద్ధం అవుతామ‌ని, ఇందులో ఎటువంటి సందేహాల‌కూ తావే లేద‌ని  స్ప‌ష్టం చేస్తూ రైతుల ప‌క్షం తాను నిలుస్తాన‌ని మ‌రో మారు ప్ర‌క‌టిస్తూ సంబంధిత వ‌ర్గాల‌కు సంబంధించి ఓ సంతృప్తిక‌ర విధానాన్ని అందించారు. ఇక అమ‌లే త‌రువాయి…

నిర్ణ‌యం ఆల‌స్యం అయినా కొన్ని సార్లు వేచిచూసే ధోర‌ణి కార‌ణంగా కొంత సందిగ్ధ‌త నెల‌కొంటుంది. నిర్ణ‌యం అమ‌లు మాత్రం వేగం అయితే కొన్ని సార్లు అనుకున్న స‌మ‌యం క‌న్నా ముందే మంచి ఫ‌లితాలు వ‌చ్చి సంబంధిత వ‌ర్గాల‌కు ఆస‌రా ఇస్తాయి. మ‌నో నిబ్బ‌రం మ‌రింత పెంచి, పాలక వ‌ర్గాల‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని స్థిరం చేస్తాయి. ఆ విధంగా ఇవాళ్టి ఉత్త‌మ పురుష‌లో కేసీఆర్ గురించి.. ఇంకొంత.

గ‌త కొద్ది రోజులుగా కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం ఓ కొలిక్కి రాక‌మునుపే కేసీఆర్ ఓ సానుకూల నిర్ణ‌యం వెలువ‌రించి, రైతుల‌కు శుభవార్త చెప్పారు. యాసంగి వ‌డ్లు తామే కొనుగోలు చేస్తామ‌ని, ఎవ్వ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, త్వ‌ర‌లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని, త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవాల్సిన ప‌నే లేద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో తీవ్ర ఉత్కంఠ‌కు తెర‌పడింది. దీంతో రైతులకు ఓ విధంగా ఊర‌ట ల‌భించింది. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఖ‌ర్చు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని తెలుస్తోంది ముఖ్య‌మంత్రి మాట‌ల ప్రకారం. ఆ పాటి భారం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున తామే మోస్తామ‌ని చెప్ప‌డం కేసీఆర్ లో ఉన్న ప‌రిప‌క్వ‌త‌కు తార్కాణం లేదా నిద‌ర్శ‌నం అని రాయాలి.

వాస్త‌వానికి కేంద్రం మొద‌ట నుంచి ధాన్యం కొనుగోలుకు అడ్డం ప‌డుతూనే ఉంద‌ని కేసీఆర్ అంటున్నారు. అయినా స‌రే ఈ ప్ర‌తిష్టంభ‌న తొల‌గించేందుకు బీజేపీ స‌ర్కారు సాయం చేయ‌కున్నా తామే ధాన్యం కొనుగోలు చేసి రైతాంగానికి సంబంధిత మొత్తాల‌ను వారి ఖాతాల‌లో జ‌మ చేస్తామ‌ని చెప్ప‌డం కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణ‌యం. అదేవిధంగా దేశ వ్యాప్తంగా రైతుకు
గిట్టుబాటు ధ‌ర ద‌క్కేలా మ‌ద్ద‌తు ధ‌ర‌కు సంబంధించి చ‌ట్టం తేవాల‌ని  చెప్ప‌డం కూడా మంచి ప‌రిణామ‌మే! ఆ విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రాల‌న్నీ ఏక తాటిపై నిలిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న‌ది కేసీఆర్ మాట. స‌మ‌గ్ర నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టం రూప‌కల్ప‌న చేస్తే సాగు అన్ని విధాలా మేలు అన్న భావ‌న స్థిరీక‌ర‌ణ‌కు నోచుకుంటుంద‌న్న‌ది సీఎం అభిప్రాయం. మ‌నోగ‌తం కూడా!

Read more RELATED
Recommended to you

Latest news