కాంగ్రెస్ పార్టీ సంగతి అటుంచండి.. మొదట ప్రజలు నష్టపోతున్నారు : భట్టి

-

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్‌ రావుకు భట్టి విక్రమార్కకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే.. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని, తద్వారా అధికంగా నష్టపోయేది ఖమ్మం జిల్లానే అని భట్టి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఆశలన్నీ నాగార్జునసాగర్ ఎడమ కాలువపైనే ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. పాలేరు నుంచి మొదలుపెడితే వైరా, మధిర, సత్తుపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు తాగునీరు రావాలన్నా ఎన్ఎస్ పీ కెనాలే దిక్కు అని వెల్లడించారు. ఈ విషయం ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కూడా తెలుసని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అనేక ప్రాజెక్టులు చేపట్టారని, అయితే కాంగ్రెస్ పార్టీపై కోపంతో ఆ ప్రాజెక్టులను నిలిపి ఉంచడం మందిది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సంగతి అటుంచండి… మొదట ప్రజలు నష్టపోతున్నారు… ముందు ఆ విషయం చూడండి అని హితవు పలికారు. గత ప్రభుత్వాల్లో అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశారని, కానీ అవి ఇప్పుడు ఓ మోస్తరు మరమ్మతులతో మూలనపడ్డాయని, ప్రభుత్వం వాటిని పట్టించుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, పంపులు కట్టారు కానీ తమను వెళ్లనివ్వరని భట్టి ఆరోపించారు. ప్రాణహిత కూడా పూర్తిచేయాలని, దేవాదుల ప్రాజెక్టును ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news