మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కేక్‌లు కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సామాన్యులే కాదు.. సినీ, రాజకీయ ప్రముఖులూ సోషల్ మీడియా వేదికగా చిరు విషెస్ తెలుపుతూ ఆయనపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారో చూద్దాం..
“అన్నయ్య.. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. నేను ఆరాధించే చిరంజీవిగారిని అలా పిలవడమే అందుకు కారణమేమో. ఆయన్ను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి అన్నయ్యకు జన్మదినం సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే.. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన సాధించిన విజయాలు, ఆయన కీర్తిప్రతిష్ఠలు, ఆయన సేవాతత్పరత గురించి తెలుగువారితోపాటు యావత్ భారత్‌కీ తెలుసు. అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం. ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చెమటను ధారగా పోసి సంపాదించిన దాంట్లోంచి ఎందరికో సాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్న, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన, చదువుకు దూరమైన వారి గురించి తెలియగానే తక్షణమే స్పందించి సహాయం చేసే సహృదయుడు అన్నయ్య”
“కొవిడ్ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటించకుండా ఆయన చూపిన దాతృత్వం.. బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరచుకున్న రక్త సంబంధం.. వేలాది గుప్త దానాలు.. ఇలా ఒకటీ రెండూ కాదు ఎన్నో. ఇటీవల ప్రకటించిన ఉచిత ఆస్పత్రి స్థాపన వరకూ చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతామూర్తిని తెలియజేస్తాయి. అన్నింటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతం. వయసు తారతమ్యాలు, వర్గ వైరుధ్యాలు, కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే విశాల హృదయుడు అన్నయ్య. అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావటం నా పూర్వజన్మ సుకృతం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్లు చిరాయువుగా వర్థిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అన్న రూపంలో ఉన్న మా నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా”- పవన్ కల్యాణ్
నిజ జీవితంలోనూ మెగాస్టార్ అయిన చిరంజీవిగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. – తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
పుట్టిన రోజు శుభాకాంక్షలు చిరంజీవిగారు. మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, విజయాలు వరించాలని కోరుకుంటున్నా. – తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
హ్యాపీ బర్త్‌డే చిరు బాయ్. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. – మమ్ముట్టి.
స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతోపాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. – రోజా.
నాలో నిరంతరం స్ఫూర్తినింపే వ్యక్తి, ప్రియమైన మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని, మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నా. – సాయిధరమ్ తేజ్.
హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. మీరు ఆయురారోగ్యాలు, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా. – శ్రీకాంత్.
సినీ జగదేకవీరుడికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ విజయాలతో వర్థిల్లాలి బాబాయ్. – రాఘవేంద్రరావు.
రీల్, రియల్ లైఫ్‌లో అసలైన సూపర్‌హీరో, సిల్వర్ స్క్రీన్ బాస్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. – మెహర్ రమేశ్.
హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి. మీలోని ప్రతిభ, నిరంతరం కష్టపడే తత్వం, దయా హృదయం, సంకల్పం, అంకిత భావాలే మిమ్మల్ని ఎవర్‌గ్రీన్ మెగాస్టార్‌గా నిలిపాయి. – శ్రీను వైట్ల.
కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, సినీ కళామ్మతల్లి ముద్దు బిడ్డ, అన్నయ్య చిరంజీవిగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరిచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహానికి థ్యాంక్ యూ అనే మాట సరిపోదు. – బాబీ.