గ్రామసర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ గవర్నర్ తమిళి సైకి బిజెపి వినతిపత్రం అందించింది. తెలంగాణ లోనే కాదు దేశమంతా సర్పంచ్‌లకు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి నిధులు, విధుల వినియోగంలో సర్వాధికారాలను కట్టబెడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందని..కానీ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సర్పంచ్‌లకు ఉన్న అధికారాలకు కత్తెర వేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యాలను నీరు గారుస్తోందని ఈ సందర్భంగా బీజేపీ పార్టీ విమర్శలు చేసింది.
73, 74 రాజ్యాంగ సవరణలకు, దాని స్ఫూర్తికి సంపూర్ణంగా బిజెపి కట్టుబడి ఉంది. ‘‘ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ 2014లో విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని రాదలిచాం. 2014 టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ.నెం.25లో ‘ ‘గ్రామీణాభివృద్ధి ` పంచాయతీరాజ్ వ్యవస్థ’’ అనే అంశం కింద స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు చేస్తామని, 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థలకు యుద్ధప్రాతిపదికన అధికార బదలాయింపు చేసి ఈ సంస్థలను పటిష్టం చేయాలనే ధృడనిశ్చయంతో ఉందని, ఇంతేకాకుండా గత ఆరు దశాబ్దాలుగా వలసపాలకుల అసమర్థ పరిపాలనలో స్థానిక స్వయం పరిపాలన వ్యవస్థలు నిర్వీర్యం చేయబడ్డాయని ఫిర్యాదు తెలిపారు.