చిన్నప్పుడు చదువుకోను అంటే.. ఇంట్లో వాళ్లు.. చదువుకోకపోతే పెద్దయ్యాక గేదలు కాయాల్సి వస్తుంది అని తిట్టేవాళ్లు..కానీ ఓ యువకుడు చక్కగా చదువుకుని, ఇంజనీర్ అయినా.. ఉద్యోగం వదిలేసి మరీ గాడిదలు కాస్తున్నాడు. లక్షల్లో శాలరీ వదిలేసి సొంతూరుకి వచ్చేసి.. ఆవులు, గేదలు, మేకలు, కోళ్ల ఫారమ్ ఏర్పాటు చేశాడు. దీంతోపాటు గాడిదలు ఫారమ్ కూడా ప్రారంభించాడు. ఇతని స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నాడో చూద్దామా..!
కర్ణాటకలోని ఇరా గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఇంజనీరింగ్ చదివి, మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత అది నచ్చక, 2020లోనే ఉద్యోగం మానేశాడు. తనకున్న 2.3 ఎకరాల్లో పశువుల ఫారమ్‌లను ఏర్పాటు చేశాడు. అలా ఉండగానే.. గాడిదల ఫారమ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అప్పుడు అతడి పనికి నవ్వుకున్నారు. కానీ శ్రీనివాస్ అవేవి పట్టించుకోకుండా… గాడిదల ఫారమ్‌ను ఏర్పాటు చేశాడు. గాడిద పాలలో ఔషధ గుణాలు, అనేక రోగాలను తగ్గించే గుణాలు ఉంటాయని గుర్తించాడు. గాడిద పాలను బ్యూటీపార్లర్ ప్రొడక్ట్స్‌లో వినియోగించారు.
ఇప్పుడు అతని దగ్గర 20 వరకు గాడిదలు ఉన్నాయి. అతని దగ్గర పశువులు, మేకలు, కుందేళ్లు, కడక్ నాథ్ కోళ్లు, గాడిద ఫారమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం అతను 30 ఎంఎల్ గాడిద పాల ధరను.. రూ. 150కి విక్రయిస్తున్నాడు.. మాల్స్, షాప్స్, సూపర్ మార్కెట్స్‌కు పాలను సరఫరా చేస్తాడట. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ కంపెనీ 17 లక్షల రూపాయల గాడిద పాల కోసం ఆర్డర్ ఇచ్చిందట. అంతే శ్రీనివాస్ కష్టానికి మంచి ఫలితం లభించినట్లైంది.
నిజానికి గాడిద పాలల్లో ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఈ పాలతో బిజినెస్ అనేది మంచి ఐడియా అనే చెప్పాలి. ప్రస్తుత కాలంలో గాడిద పెంపకం తగ్గడం, అందరూ గాడిదలను చిన్నచూప చూడటం శ్రీనివాస్ గౌడ్‌ను చలించిపోయేలా చేసింది. ఎవరు ఎంత ఎగతాళి చేసినా అవేవి పట్టించుకోకుండా శ్రీనివాస్ గాడిదల ఫారమ్ పెట్టాడు. కర్నాటకలోనే ఇదే తొలి గాడిదల ఫారమ్. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో కూడా ఒక గాడిదల ఫారమ్ ఉంది.
జీవితంలో నచ్చని పని చేయడం కంటే నరకం ఇంకోటి ఉండదు. కానీ, చాలామంది పరిస్థితులకు తలవంచి నచ్చని జాబ్ చేస్తుంటారు. కొందరే ఇలా ఉద్యోగాలు మానేసి వారికి ఇష్టమైన దిశగా అడుగులు వేస్తారు.!
– Triveni Buskarowthu