హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాటల యుద్థం జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం కేసీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాగా టీఆర్ఎస్ పార్టీపై పోరుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. పథకాలపై నిరసన తెలిపేందుకు సిద్ధమవుతోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన దళిత బంధునే ఆయుధంగా చేసుకుని బీజేపీ నిరసనలకు సిద్ధమవుతోంది.
దళిత బంధును అమలు చేయాలని నేడు బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. డప్పుల మోత పేరుతో దళిత బంధును అమలు చేయాలని నిరసన తెలుపనున్నారు. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి డప్పుల మోత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డప్పుల మోతతో నిరసన తెలుపనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంబయ్ పాల్గొననున్నారు.