మునుగోడు మండలం పలివేలలో బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. పలివెలలో ఓవైపు బిజెపి, మరోవైపు టిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పైన రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
దాడులు చేస్తూ టిఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. హింసను ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడారని.. వ్యూహం ప్రకారమే ఈటెల, ఆయన భార్యపై దాడీకి దిగారని మండిపడ్డారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే టీఆర్ఎస్ దాడులకు దిగిందని అన్నారు. ఇలాంటి దాడులకు బిజెపి భయపడదు అన్నారు కిషన్ రెడ్డి. పోలీసులు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ ఘటనపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ఓటమి ఖాయం అయిందని.. అందుకే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాసనమండలి సభ్యుడే దగ్గరుండి ఈటలపై దాడి చేయించారని అన్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులకు తెగబడినా బీజేపీ విజయం తధ్యమని అన్నారు.