దేశంలో మొదటిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే.. ముందు నుంచి ఎన్డీయే ప్రభుత్వం ముర్మును ఎంపిక చేయడానికి రాజకీయ లబ్దే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్రానికి పోతే అక్కడి బీజేపీ నాయకులే గైర్హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు బీజేపీ ముఖ్య నాయకులు డుమ్మా కొట్టడం పలు ప్రశ్నలకు తావిస్తున్నది.
గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ర్టానికి గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి వస్తే మర్యాదపూర్వకంగానైనా బీజేపీ నాయకులు కలువకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిపుర రాష్ట్రంలోని అగర్తల రవీంద్ర శతబర్షికి భవన్‌లో ముర్ము బుధవారం పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ముర్ముకు స్వాగతం పలికేందుకు బీజేపీ చేసిన ఏర్పాట్ల గురించి ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరించిన బీజేపీ త్రిపుర ప్రదేశ్ ప్రెసిడెంట్ రాజీవ్ భట్టాచార్జీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మాత్రం కనిపించలేదు.మాజీ సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ కూడా రాష్ట్రపతి పర్యటనకు దూరంగా ఉన్నారు.