ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన పాదయాత్ర అక్టోబర్ 24న తెలంగాణలోకి ప్రవేశించనుంది. అయితే ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో రాహుల్ యాత్రపై సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలకు వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర పట్ల తెలంగాణలో పెద్దగా ప్రచారమే జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
పబ్లిసిటీలో అందరికంటే ముందు ఉండే రేవంత్ రెడ్డి… జోడో యాత్ర పబ్లిసిటీలో మాత్రం ఎందుకు వెనుకబడ్డారంటూ నేరుగా రేవంత్‌నే ప్రశ్నించారు కేసీ వేణుగోపాల్. ఇకనైనా జోడో యాత్ర ప్రచారాన్ని పెంచాలని రేవంత్‌కు సూచించారు కేసీ వేణుగోపాల్. ఈ సందర్భంగా కలగజేసుకున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి… యాత్రలో సత్తా చాటుతున్నారంటూ వేణుగోపాల్‌పై ప్రశంసలు కురిపించారు. వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యలకు అడ్డు తగిలిన వేణుగోపాల్…యాత్ర గురించి మాట్లాడమంటే తనను పొగుడుతారేమిటని కేసీ వేణుగోపాల్ వారించారు.