‘ఉచితాలు సంక్షేమం కాదు’.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

-

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై ఇటీవల తెగ చర్చ జరుగుతోంది. ఉచితాలు మంచివి కాదని కేంద్రం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉచితాలకు సంక్షేమానికి మధ్య తేడా ఉందని బీజేపీ అభిప్రాయపడింది. ఎన్నికల నియమావళిలో మార్పుల ప్రతిపాదనకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీ అభిప్రాయాలను ఈసీ కోరిన నేపథ్యంలో బీజేపీ తన వైఖరిని తెలియజేసింది.

‘ఉచితాలు అనేవి ఓటర్లను ఆకర్షించడానికి చేసేవి. అదే సంక్షేమం మాత్రం సమ్మిళిత వృద్ధి కోసం తీసుకునే విధానపరమైన నిర్ణయం. ప్రజల సామర్థ్యాలను పెంచడం, ఆర్థికంగా వృద్ధి చెందేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించడంపై దృష్టి సారించాలి’ అని పేర్కొంటూ ఈసీకి బీజేపీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఎన్నికల్లో ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు ఆర్థికంగా ఎలా సాధ్యమనే విషయాన్ని పార్టీలు తెలియజేయాలనే ఎన్నిక సంఘం ఆలోచనపైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ పేర్కొంది. ప్రజలకు ఇళ్లు, ఉచిత రేషన్‌ ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఉంటే, ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడమనేది మరో లక్ష్యంతో కూడుకున్నదని బీజేపీ అభిప్రాయపడింది. ఉచితాలపై ప్రధాని మోదీ వైఖరి కూడా ఇదేనని ఈసీకి రాసిన లేఖ రూపకల్పనలో ఒకరైన పార్టీ సీనియర్‌ నేత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news