త్వరలో ఉమ్మడి నల్లగొండలో ఉప ఎన్నికలు… రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.

హుజూరాబాద్ గెలుపుతో బీజేపీ మంచి ఉత్సాహం మీద ఉంది. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపు తమదే అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా ఉప ఎన్నికలపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఇప్పటికే వేముల వాడ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగబోతున్నాయని ఇటీవల రఘునందన్ రావు అన్నారు. తాజాగా నల్లగొండలో ఉపఎన్నికలు ఉండబోతున్నాయని అన్నారు. ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ సిద్దంగా ఉందన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆలోచన విధానంలో తేడా వచ్చిందని, దానికి నిదర్శనమే హుజురాబాద్ ఎన్నికల ఫలితం అని పేర్కొన్నారు. యాసంగి వడ్లను కేంద్రం ఏడు ఏళ్లుగా కొంటుందని… ఈ ఒక్క ఏడాది కొనదన్నందుకు కేంద్రానిదే తప్పు అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తప్పు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా జైలుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే రఘునందన్ ఉద్ఘాటించారు