ఓరుగల్లులో బీజేపీ స్కెచ్‌ బెడిసి కొట్టిందా ?

-

గ్రేటర్ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో దూకుడు పెంచిన బీజేపీ వరంగల్ లో వరుస కార్యక్రమాలతో దూకుడు పెంచింది. ఎంపీ అరవింద్‌ కారు అడ్డుకున్న సమయంలో మొదలైన గొడవ అయోధ్య విరాళాలు ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివాదం వరకు కొనసాగుతూనే ఉంది. వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా.. దాన్ని అవకాశంగా మలుచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కమలం కేడర్ అత్యుత్సాహం మాత్రం దూకుడు మీదున్న బీజేపీని డిఫెన్స్ లో పడేసింది.

గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది.
ఎంపీ అరవింద్‌ కారును అడ్డుకున్నందుకు.. ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఇంటిని ముట్టడించారు. జనగామ జిల్లాలో యూత్ కార్యకర్తలపై పోలీసులు దాడి చేస్తే.. వరంగల్ అర్బన్ జిల్లా నేతలతోనే నిరసన కార్యక్రమానికి చెపాట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ స్మారక చిహ్నం నిర్మాణం కోసం.గుడి స్థలం విషయంలోనూ బిజెపి గట్టిగానే నిరసనలు చేసింది. కానీ, రాముడిని కించపరిచారంటూ ధర్మారెడ్డికి వ్యతిరేకంగా చెపట్టిన నిరసనలు వివాదాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో మాత్రం బీజేపీ విఫలమైందన్న చర్చ జరుగుతుంది.

అయోధ్య రామమందిరం కోసం సేకరిస్తున్న విరాళాలపై ధర్మారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని గుర్తించడంలో స్థానిక బీజేపీ నేతలు విఫలమయ్యారు. రెండు, మూడు రోజుల తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అప్పుడు రాష్ట్ర నేతలు మందలించాక.. స్థానిక బీజేపీ నిరసనలకు దిగింది. అయితే తాను రాముడిని ఎక్కడా కించపరచలేదని.. బీజేపీ కార్యకర్తలు అడుగుతున్న చందాల లెక్కల గురించి మాత్రమే అడిగానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

ఈ వివాదాన్ని క్లెయిమ్‌ చేసుకోవడంలో విఫలమైన స్థానిక బీజేపీ నేతలు.. అధిష్టానం దగ్గర మార్కులు కోట్టేసేందుకు.. అప్పటికప్పుడు నిరసనకు దిగారు. కానీ ఆ ప్లానే బెడిసికొట్టింది. యూత్‌ను ముందు పెట్టుకొని చేసిన నిరసన కార్యక్రమం.. అదుపు తప్పి దాడికి దారి తీసింది. దీంతో ధర్మారెడ్డి వ్యాఖ్యల్ని ప్రజల్లో ఎండగట్టాలనుకున్న వారు కాస్తా.. జైలుపాలయ్యారు.
కమలం పార్టీ కార్యకర్తల తొందరపాటు చర్య.. ఈ ఇష్యూను క్యాష్‌ చేసుకునే అవకాశాన్ని చేజార్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిజానికి ఈ అంశంపై రోజుకో దగ్గర నిరసన చేసేందుకు సీనియర్లు కసరత్తు చేశారట. ఆలయాల దగ్గర నిరసనలు, ర్యాలీలు, రాస్తారోకోలకు ప్లాన్‌ చేశారు. అయితే దాడితో ఆ ఇష్యూ సైడ్‌ ట్రాక్‌ అయిపోయింది. అంశాలపరంగా రాజకీయ దాడి చేయాలి కానీ.. భౌతిక దాడులకు దిగితే ఇష్యూ డైవర్ట్‌ అవుతుంది. ఇక్కడ స్థానిక బీజేపీ ఇదే పొరపాటు చేసిందనే వాదన వినిపిస్తోంది. అసలు విషయంకన్నా.. దాడి అంశమే హైలైట్‌ అయింది. మొత్తానికి ఓరుగల్లులో బీజేపీ అనుకున్నది ఒకటి అయితే జరిగింది మరోకటిలా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news