ఆ బెజ‌వాడ టీడీపీ నేత హ‌వా మ‌ళ్లీ మొదలైందా…!

-

కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు బోడే ప్ర‌సాద్ పుంజుకున్నారా ? ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంలోను, గ‌తంలో చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డంలోనూ స‌క్సెస్ అయ్యారా ? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో బోడే ప్ర‌సాద్‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిలో ప్ర‌ధానంగా కాల్ మ‌నీ కేసులో ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అదేవిధంగా పార్టీ శ్రేణుల‌ను ప‌ట్టించుకోకుండా త‌న మానాన త‌ను వ్య‌వ‌హ‌రించార‌ని త‌మ్ముళ్లే విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మూడు గ్రూపులుగా ఏర్పడిన త‌మ్ముళ్లు.. బోడే ప‌రాజ‌యానికి త‌మ వంతు కృషి చేశార‌నే టాక్ ఉంది.

టీడీపీని ఎప్పుడూ అభిమానించే క‌మ్మ సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 55 వేలు ఉన్నారు. ఇక బీసీలు కూడా బ‌లంగా ఉన్నారు. అందుకే బోడేకు 2014 ఎన్నిక‌ల్లో 32 వేల పై చిలుకు భారీ మెజార్టీ వ‌చ్చింది. అయితే ఐదేళ్ల పాటు త‌న చుట్టూ ఓ కోట‌రీని ఏర్పాటు చేసుకుని రాజ‌కీయాలు చేయ‌డంతో పాటు ఆయ‌న‌పై వచ్చిన ఆరోప‌ణ‌లు, అధికారుల‌ను బెదిరించ‌డం వంటి ఆరోప‌ణ‌ల‌తో టీడీపీ కంచుకోట‌లోనే ఆయ‌న ఓడిపోయారు. ఒకానొక టైంలో చంద్ర‌బాబు కుమారుడు సైతం ఇక్క‌డ నుంచే పోటీ చేయాల‌నుకున్నారు.

ఓట‌మి అనంత‌రం.. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టిన బోడే.. త‌మ్ముళ్ల‌ను క‌లుసుకున్నారు. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ఆలోచ‌న చేశారు. మ‌రోప‌క్క‌, వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. ప‌నులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టినా.. ఆయ‌న సాధించ‌లేక పోయారు. దీంతో వైసీపీ శ్రేణుల‌ను కూడా ఆయ‌న క‌ల‌వ‌కుండా దూరం పెట్టారు.

ఈ ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న బోడే ప్ర‌సాద్ వాయిస్ త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం ప్రారంభించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన టీడీపీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో బోడేపై నాయ‌కులు విమ‌ర్శ‌లు త‌గ్గించి.. బాగానే ప‌నిచేస్తున్నార‌ని.. త‌మ స‌మ‌స్య‌లు వింటున్నార‌ని బాబుతో చెప్పార‌ట‌. దీనిని బ‌ట్టి బోడే పుంజుకున్నార‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక విజ‌య‌వాడ న‌గ‌రానికి ఆనుకుని ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో రాజ‌ధాని మార్పు ప్ర‌భావం కూడా ఇక్క‌డ గ‌ట్టిగానే ఉంది. ఈ ప‌రిణామాలు ఇక్క‌డ బోడేకు క‌లిసి వ‌స్తున్నాయి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news