బూస్టర్ డోస్.. కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోవడానికి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న ప్రతీ ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత దాని పనితీరు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. కొన్ని నెలల తర్వాత వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గిపోవచ్చు. అలాంటి సమయంలో బూస్టర్ డోస్ అవసరం అవుతుంది. ఈ బూస్టర్ డోస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం యునైటెడ్ కింగ్ డమ్ లో ఈ బూస్టర్ షాట్ ని ప్రజలకు అందిస్తున్నారు.
ఇక భారతదేశ విషయానికి వస్తే, మన ప్రజలకు ఇప్పుడే బూస్టర్ డోస్ అవసరం లేదని ఆరోగ్యశాఖ వెల్లడి చేసింది. కరోనా వ్యాక్సినేషన్ పెరుగుతున్న తరుణంలో రెండవ డోసు తీసుకోవడమే అతి ముఖ్యమని, ఇప్పటికే 20శాతం మందికి రెండు డోసులు పడ్డాయని, 63శాతం మందికి మొదటి డోసు పడిందని, అందువల్ల బూస్టర్ డోస్ అవసరం లేదని, ఒకవేళ కావాల్సి వస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే బూస్టర్ డోస్ అవసరమని తేల్చింది.