ఏపీలో డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యాచరణ కొనసాగుతోంది. దీనిపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉద్యమం తీవ్రమైతే తాము బాధ్యులం కాదని అన్నారు.
డిమాండ్ల పరిష్కారానికి 47 రోజులుగా నిరసనలు తెలుపుతున్నామని బొప్పరాజు వివరించారు. రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యామని, కానీ సమావేశాలతో ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు.
ఈ నెల 28 నుంచి కార్మిక, టీచర్స్, సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నామన్నారు. తాము చాలా ఓపికతో సహనంతో ఉద్యమాన్ని చేస్తున్నామన్నారు. తెలంగాణాలో ఒక్క డీఏ పెండింగ్‌లో లేదని, కానీ ఏపీ లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీఏ ఊసే లేదన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అంశాలపై సమస్యలు పెంచే కొద్ది పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. 50 పేజీల నివేదిక అంశాలను సీఎస్‌కు అందచేశామన్నారు. సీఎస్ వాటిని తప్పకుండా పరిష్కారం చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.