కొన్ని దశబ్దాలుగా ప్రేక్షకులకు బ్రహ్మానందం గారు హాస్యంతో ఎలా ముంచి ఎత్తుతారో అందరికి తెలిసిందే. తెరపై ఆయన కనిపిస్తేనే ప్రేక్షకులు హాస్యంలో మునిగి తేలుతారు. తెలుగు తెరపై కమెడియన్ గా ఆయన పోషించినన్ని విలక్షణమైన పాత్రలను మరొకరు పోషించడం అసాధ్యం. ఆయన మేనరిజమ్స్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇంత గొప్ప నటుడైన బ్రహ్మానందం పై ఇపుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడిగా ఇంత సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇప్పుడు ప్రశంసలు కురవడం ఏంటని అనుమాన పాడడం సహజమే. అడపా దడపా మాత్రమే కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం, ఎక్కువగా నవ్వులతోనే అభినందనలు అందుకున్నారు. అలాంటి ఆయన ‘రంగమార్తాండ’ సినిమాతో అందరిని కన్నీళ్లు పెట్టించారు.
రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం బయటపెట్టారు. ‘మన కోసం ఎదురుచూసేవారు లేనప్పుడు మరణించడమే సుఖం’ అంటూ హాస్పిటల్ సీన్ లో అందరిని ఏడిపించారు బ్రహ్మానందం. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఎమోషన్స్ ఉంటాయనే విషయం ప్రేక్షకులకు తెలుసు. కానీ బ్రహ్మానందం పాత్ర ఈ రేంజ్ లో ఏడిపిస్తుందనీ, ఈ పాత్రలో ఆయన ఇంతలా విజృంభిస్తారని గాని ఎవ్వరు ఊహించలేరు. ఆయన నటన గురించే మరోసారి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరియు మెగా స్టార్ చిరంజీవి, ఇద్దరూ కూడా బ్రహ్మానందం గారిని ప్రశంసించారు.