బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కీలకమైన అంశాలపై తన ఆలోచనలు, భావాలకు తగినట్లు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు. దీనికి ఆయన కొత్తగా రాజు కావడమే కారణం.
ఆయన అంతర్జాతీయ వేదికలపై కానీ, మరెక్కడైనా కానీ ఏం మాట్లాడాలన్నా దానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఆయన వాతావరణ మార్పులు, పర్యావరణంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను ప్రస్తుతం నామమాత్రంగా కూడా ప్రస్తావించే అవకాశం లేదని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు రాజరికాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. రాజ్యాధిపతిగా పదవి చేపట్టిన ప్రిన్స్ ఛార్లెస్‌ను రాజుగా గుర్తించటానికి నిరాకరిస్తూ వీధుల్లో.. సామాజిక మాధ్యమాల్లో ‘నాట్ మై కింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ వీరవిహారం చేస్తోంది! రాచరికాన్ని వ్యతిరేకిస్తూ.. రాజకుటుంబాన్ని వెక్కిరిస్తూ.. నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అరెస్టు చేస్తూ, ఆంక్షలు విధిస్తున్నారు. రెండ్రోజుల కిందట ఆక్స్‌ఫర్డ్‌లో సైమన్ హిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కారణం రాజుగా ప్రిన్స్ ఛార్లెస్‌ను ఎవరు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించటమే!