గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని కేసీఆర్ విమర్శించారు.చేవెళ్ల బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఇస్తామన్న బంగారం ఎక్కడికి పోయిందని, మార్కెట్లో దొరకట్లేదా? అని కేసిఆర్ ప్రశ్నించారు. హామీలను నెరవేర్చకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రభుత్వం మెడలు వంచి అమలు చేసేలా చూస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు . బడుగు బలహీన వర్గాల కోసం తాము తెచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో చూడాలని అన్నారు.
అధికారం చేపట్టిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. 15ఏళ్లు పోరాటం చేసి సాధించిన తెలంగాణను మళ్లీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.