నేడు నిర్మ‌ల్ కు అమిత్ షా.. రాజ‌కీయ సమీకరణాలు మారేనా!

-

నేడు సెప్టెంబరు 17.. ఈ రోజుకు తెలంగాణ చ‌రిత్రలో ఎంతో ఘన చరిత్ర ఉంది. నాటి హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమయిన రోజు. ఐతే.. ఈ రోజుపై చాలా రోజులుగా చ‌ర్చ న‌డుస్తుంది. కొందరు ఈ రోజును విలీన దినోత్సవమంటే.. మరికొందరు విద్రోహదినమ‌ని, విమోచన దిన‌మ‌ని భావిస్తారు. ఐతే ఎంతో ప్రాధాన్య‌త ఉన్న ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. తెరాస స‌ర్కార్ ఈ రోజుకు ప్రాధాన్యత ఇవ్వ‌డంలేద‌ని మండిప‌డుతుంది.

ఈ నేప‌థ్యంలో నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్య‌ట‌న చేస్తున్నారు. నిర్మల్‌లో ఉరులమర్రిని సందర్శిస్తారు. అనంత‌రం నిర్మల్‌లో బీజేపీ నిర్వ‌హించ‌నున్న‌భారీ బ‌హిరంగ స‌భ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్నారు. ఇందుకోసం గ‌తంలో ఎన్నడూలేని రీతిలో బీజేపీ భారీస్థాయిలో ఏర్పాటు చేస్తుంది. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

అమిత్ షా ఢిల్లీ నుంచి నాందేడ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిర్మల్‌ చేరుకొనున్న‌ట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ కు చేరుకోనున్న అమిత్ షా.. రోడ్డు మార్గంలో రాంజీ గోండు స్మారక స్తూపాన్ని దర్శించుకుని‌ నివాళులర్పించనున్నారు. అనంత‌రం బత్తిస్ఘడ్ రోడ్డు మార్గం గుండా ఎల్లపల్లి స్థబా స్థలికి చేరుకోనున్నారు.

ఈ స‌భ‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. అలాగే.. నేడు ప్రధాని మోదీ జన్మదినోత్సవం కావ‌డంతో సభ ప్రాంగణంలో అమిత్‌షా మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించ‌నున్నారు.

ఇక అమిత్ షా టూర్ నేపథ్యంలో జిల్లా బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. అమిత్ షా త‌న ప్ర‌సంగంలో టీఆర్ఎస్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడతారు. కేవలం విమోచన దినోత్సవం గురించే మాట్లాడతారా? లేక కేటీఆర్,టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతారా? అనేది చర్చనీయంగా మారింది.

ఏది ఏమైనా ఈ టూర్ మాత్రం రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అమిత్ షా టూర్‌తో బీజేపీ కొత్త ఉత్సాహం వస్తుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version