సీనియర్ తెలుగు సినీ నటుడు చలపతిరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదివారం జూబ్లీహిల్స్ లోని చలపతి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు మంత్రి తలసాని. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలో అందరితో ఎంతో కలివిడిగా ఉండే వ్యక్తి మన మధ్యలో లేడనే వార్త తనని ఎంతో కలిచి వేస్తుందన్నారు తలసాని.
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించిన రెండు రోజులు గడవకముందే చలపతి రావు రూపంలో మరో నటుడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం కావడం తీరనిలోటు అన్నారు. విభిన్న పాత్రలలో తన నటనతో చలపతిరావు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని తెలిపారు. మూడు తరాల నటులతో చలపతిరావు నటించారని అన్నారు మంత్రి తలసాని.