అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవటం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అల్లూరి తన జీవితాంతం పోరాటంలోనే ఉన్నారని.. చిన్న వయసులోనే బ్రిటిష్ వారిని గడగడలాడించారని తెలిపారు చంద్రబాబు. గిరిజనులందరిని సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగారన్నారు.
అల్లూరి పోరాటం తట్టుకోలేక ఆ రోజులోనే బ్రిటిష్ వారు ఆయన్ని చంపేందుకు రూ.40 లక్షలు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. 27 సంవత్సరాల వయసులోనే ఆయనను బ్రిటిష్ వారు అంతమొందించినా ఆయన పోరాటం శాశ్వతం నిలిచిపోయిందని.. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రాకున్నా.. 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు. ప్రధాని నిర్ణయాన్ని పార్టీ పరంగా స్వాగతిస్తున్నాం… పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని కోరుతున్నామన్నారు బాబు.