తెలుగు దేశానికి సంపద సృష్టించడం తెలుసని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఇక్కడ తెలుగు దేశం పార్టీ లక్ష మెజారిటీ సాధించాలన్నారు.నేటి తరానికి నాటి కుప్పం ఎలా ఉండేదో తెలీదు, ఈ యువత చూస్తున్నది అభివృద్ది చెందిన కుప్పం అని వెల్లడించారు. నాడు అత్యంత వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని నేను నియోజకవర్గంగా ఎంచుకున్నాను అని తెలిపారు.
“నా చిన్నప్పుడు పాఠశాలకు 6 కి.మీ దూరం నడిచి వెళ్లి కష్టపడి చదివా… అందుకే నేడు ఈ స్ధాయిలో ఉన్నా. ఉమ్మడి రాష్ట్రానికి ఎవరు చేయనంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశా. పట్టుదలతో ముందుకు వచ్చా… అంబేద్కర్, ఎన్టీఆర్, మోదీ వంటి మొదలైన గొప్ప నాయకుల చరిత్ర వెనుక పట్టుదలే కనిపిస్తుంది.
వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని కుప్పంకు వచ్చాను. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన రూంలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ తరువాత అంతా మీరే చూసుకున్నారు. మీతో బంధం బలపడింది. అప్పట్లో కుప్పంలో రోడ్లు లేవు… స్కూళ్లు లేవు. నాడు ఇంటింటికి రెండు ఆవులు ఇస్తాను అంటే నవ్వారు, కానీ తరువాత పాడి పరిశ్రమ అభివృద్ది అయ్యింది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పాల ఉత్పత్తి పెరిగింది. ఆదాయం పెరిగింది అని అన్నారు ఆయన.