ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురజాల నియోజకవర్గం ముందంజలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. నేతలు ఎందుకు కలిసి పని చేయలేకపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే… కేవలం ఇన్ఛార్జీలు మాత్రమే భేటీ కావడంపై కన్నెర్ర చేశారు చంద్రబాబు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో నేతలు వెనుకబడి ఉన్నారని చంద్రబాబు అన్నారు. సభ్యత్వాల నమోదులో ఉమ్మడి జిల్లాలో గురజాల నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు. ఇతర నియోజకవర్గాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని ప్రశ్నించారు చంద్రబాబు. జల్లా విడిపోయిన తర్వాత నేతల మధ్య సమన్వయం కొరవడిందని అన్నారు.
కొందరు పోలీసుల వ్యవహారశైలిపై ప్రైవేటు కేసులు పెట్టాలని చెప్పినా ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా యరపతినేని కల్పించుకుంటూ… గురజాలలో నాలుగు ప్రైవేట్ కేసులు పెట్టామని చెప్పారు. ఇకపై ప్రతి నేత పనితీరును వ్యక్తిగతంగా సమీక్షిస్తానని అన్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే… కొందరు నేతలు ముందుగానే పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ చేయించుకుంటున్నారని… ఇలాంటి వాటిని ఇకపై సహించబోనని హెచ్చరించారు. మరోవైపు అందరం కలిసి పని చేస్తామని చంద్రబాబుకు నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.