నా లెక్క ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైసీపీ నేతలు: చంద్రబాబు

-

సేవాభావంతో పనిచేసే వ్యవస్థ రాజకీయమని, తన లెక్క ప్రకారం అర్హత లేని వ్యక్తులు వైసీపీ నేతలని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రౌడీయిజం, గుండాయిజం, హత్యలు, కుట్రలు, కుతంత్రాలకు తావులేదన్నారు. వైసీపీ నేతలు తమ తప్పులను పోలీసుల ద్వారా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. మేడిన్ చైనా కాకుండా.. మేడిన్ ఇండియాగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. భావితరాలకు సంప్రదాయాలను అందించాలనే స్వగ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలుగు ప్రజలకు భోగి -సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్లల్లో వేడుకలు చూడాలనే నాడు సంక్రాంతి కానుకలు ఇచ్చామన్నారు. జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి అంతా కలిసి రావాలని పిలుపిచ్చారు.


క్రాంతి అంటే అభ్యుదయమని, సంపదలు, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. భోగి-సంక్రాంతి-కనుమ.. మూడురోజుల పండుగ సంక్రాంతి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, తెలుగువారందరూ పల్లె సీమలకు తరలే ఆత్మీయ పండుగని అన్నారు. ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు.. పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాడు ఆలోచించామన్నారు. టీడీపీ హయాంలో తొలిసారిగా పేదలకు పండుగ కానుకలు ఇచ్చే సాంప్రదాయానికి నాంది పలికామన్నారు. ఒక్క సంక్రాంతికే కాకుండా.. రంజాన్, క్రిస్మస్లకు పండుగ కానుకలిచ్చామన్నారు. ఏడాదికి రూ.350 కోట్లు ఖర్చు చేసి పేదింట పండుగ సంతోషాన్ని నింపామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version