ఆ తీర్పులో క్రెడిట్ నాదే…. చంద్ర‌బాబు దేన్ని వ‌ద‌ల‌డా…!

-

ఈ దేశంలో ఎక్క‌డ ఎలాంటి సంచ‌లనం చోటు చేసుకున్నా.. త‌న‌కు, త‌న పార్టీకి ఆపాదించుకుని మార్కులు కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించే నాయ‌కుల్లో ముందు వ‌రుస‌లో ఉంటారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. గ‌తంలో అంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చిన‌ప్పుడు (ఎన్నాళ్లో కాలేదు. 2016 అక్టోబ‌రు) ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఏవిధంగా మాట్లాడారో గుర్తుందా ?  పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశంలో బ్లాక్ మ‌నీ త‌రిగిపోతుంద‌ని, దేశం బాగుప‌డుతుంద‌ని ఆయ‌న అనుకూల మీడియా ప్ర‌చారం చేసేస‌రికి జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌స్తుంద‌నుకున్నారో.. ఏమో.. చంద్ర‌బాబు ఈ నోట్ల ర‌ద్దును తానే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెవిలో చెప్పాన‌న్నారు.

అంతేకాదు. అస‌లు ఈ నోట్ల ర‌ద్దు ప్ర‌తిపాద‌న త‌న‌దేన‌ని, తానే రూ.1000, 500 నోట్లు ర‌ద్దు చేస్తే.. దేశానికి ప‌ట్టి పీడ విర‌గ‌డ‌వుతుంద‌ని, అప్పుడుకానీ, కోట్లు పోగేసిన నేత‌ల‌కు బుద్ధి రాద‌ని(ప‌రోక్షంగా అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌పై) వ్యాఖ్య‌లు చేశారు. తీరా చూస్తే.. ఓ నెల రోజులు గ‌డిచేస‌రికి ర‌ద్దు చేసిన వాటి స్థానంలో మోడీ ప్ర‌భుత్వం రూ.2000 నోటు తెచ్చింది. దీంతో బాబు వ్యూహం తేలిపోయింది. మ‌రి ఇది కూడా మీరే చెప్పారా? అంటూ ప్ర‌శ్న‌లు వ‌చ్చే స‌రికి ఆయ‌న మౌనం పాటించారు.

ఇక‌, త‌ర్వాత కూడా దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌ని పెద్ద ఉద్య‌మ‌మె తెచ్చారు. స్వామీ.. మీరు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో.. స్వ‌యంగా మీరే క‌దా ఓటింగ్ మిష‌న్ల‌కు ప‌ట్టుబ‌ట్టారు..! అని ప్ర‌శ్నిస్తే.. మొహం చాటేశారు. ఆ ఉద్య‌మం ఏమైపోయిందో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఇక‌, ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. త‌ల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడికి ఎంత వాటా ఉంటుందో.. వారి క‌డుపున పుట్టిన కుమార్తెకు కూడా అంతే హ‌క్కు ఉంటుంద‌ని.. కాబ‌ట్టి తల్లిదండ్రులు త‌మ వాటాలో కుమార్తెకు స‌గం ఇవ్వాల్సిందేన‌ని సుప్రీం కోర్టు చెప్పింది.

అంతే.. అలా తీర్పు వ‌చ్చిందో లేదో దీని నుంచి క్రెడిట్ కొట్టేసేందుకు బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. లాంగ్ లాంగ్ ఎగో.. అంటూ రింగులు రింగులు వేసుకుని 40 ఏళ్ల కింద‌కు వెళ్లిపోయారు. వాస్త‌వానికి ఆయ‌న అప్ప‌ట్లో కాంగ్రెస్‌లో ఉన్నాన‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయారు. అప్ప‌ట్లో.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ కూడా కుమార్తెకు ఆస్తిలో హ‌క్కు క‌ల్పించార‌ని, త‌ర్వాత దానిని టీడీపీ అమ‌లు చేసింద‌ని.. కాబ‌ట్టి దేశంలో మ‌హిళ‌ల‌కు ఆస్తిలో వాటా క‌ల్పించిన పార్టీ ఏదైనా ఉంటే.. అది త‌నదేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. సో.. మొత్తానికి దేన్నీ వ‌ద‌ల‌డు బాబు అని మాత్రం అనిపించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news