నిన్న వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన తర్వాత విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాన్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో.. ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జనసేన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇవాళ పవన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం జనసేనాని పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై ఆయన పవన్ తో మాట్లాడారు. వందలమంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందని, జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు.
ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ… తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతల అరెస్టులు తదితర అంశాలపై చంద్రబాబుకు వివరించారు. పవన్ కు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు, అధికార పక్షం పోలీసులతో పాలన చేయాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. పార్టీల ప్రజాస్వామ్య హక్కును ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పవన్ తో చంద్రబాబు అన్నారు.