హైదరాబాద్ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోందని, విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి హాజరవడం తనకు ఇదే మొదటిసారి అని తెలిపారు. పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అని మంచి పేరు పెట్టారని, కౌటిల్యుడి పేరు ఈ విద్యాసంస్థకు అతికినట్టు సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని గుర్తుచేశారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలన్నారు. 25 ఏళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన సమావేశం ఫలితంగానే మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ కు వచ్చిందని అన్నారు. ఇప్పుడదే మైక్రోసాఫ్ట్ కు మన సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారని గర్వంగా చెప్పారు. ఐటీ తర్వాత తాను ఎక్కువగా ఫార్మా రంగంపై దృష్టి సారించానని, జీనోమ్ వ్యాలీ కోసం అప్పట్లో భారీగా భూములు ఇచ్చామని వెల్లడించారు. ఇప్పుడు ఆ జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచం మొత్తానికి కొవిడ్ వ్యాక్సిన్ లు అందించామని చెప్పారు.