ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపాలంటూ నిప్పులు చెరిగారు. జగన్ ఉన్నంత వరకు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావని, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావని చంద్రబాబు మండిపడ్డారు. జిల్లాల పర్యటనను బుధవారం ప్రారంభించిన చంద్రబాబు… తొలి రోజు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో నెలకు లక్ష రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాలు ఇస్తే… జగన్ మాత్రం నెలకు రూ.5 వేల జీతం ఇచ్చే వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని విరుచుకుపడ్డారు.
కూలీ పని చేసుకునే వారికి కూడా నెలకు రూ.15 వేలు వస్తోంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్ల గుంతలు పూడ్చలేని వ్యక్తి 3 రాజధానులు కడతారా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తిరుగుబాటుకు సమయం వచ్చిందన్న చంద్రబాబు.. రివర్స్ పాలనకు రివర్స్ ట్రీట్‌మెంట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇక తన జిల్లాల పర్యటన గురించి మరిన్ని వివరాలు వెల్లడించిన చంద్రబాబు.. రాష్ట్రంలో మొత్తం 26 మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏజెన్సీలో 2 మహానాడులు నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు.. 15 రోజులకు ఓ మహానాడు నిర్వహిస్తామని తెలిపారు.