పోరాడలేక చేతులెత్తేశారన్న విమర్శలకు చంద్రబాబు సమాధానమేంటి..?

-

ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో.. పరిషత్ ఎన్నికల్ని బాయ్ కాట్ చేయాలన్న టీడీపీ నిర్ణయం రాజకీయ దుమారం రేపింది.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీ లాంటి పార్టీ తొలిసారి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యానికి పాతరేశారన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపడానికే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామంటోంది టీడీపీ. పోరాడలేక చేతులెత్తేశారని విమర్షిస్తుంది అధికారపార్టీ. రాజకీయాల్లో మాస్టర్ పీస్ గా చెప్పుకునే చంద్రబాబు మరి ఈ డ్యామేజ్ ని ఎలా కవర్ చేస్తారన్నది ఆసక్తి రేపుతుంది.

తన రాజకీయ చరిత్రలో తొలిసారిగా టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎప్పుడూ ఎన్నికల్ని బహిష్కరించలేదు. తెలంగాణ ఉద్యమం లాంటి సమయాల్లోనూ ఎన్నికల్లో పోటీచేసింది. మమధ్యలో కొన్నిసార్లు కొన్ని ఉపఎన్నికల్లో మాత్రం పోటీచేయలేదు. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు పోటీ చేసిన నంద్యాల లోక్ సభ స్థానంలో, కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ మరణం తర్వాత జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగ్యానాయక్ ను నక్సలైట్లు హత్య చేసిన తర్వాత ఉపఎన్నిక, వైసీపీ నేత శోభా నాగిరెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉపఎన్నికలో ఆ పార్టీ పోటీ చేయలేదు. ఏకమొత్తంగా ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి.

బహిష్కరణ నిర్ణయం తీసుకోవడానికిక ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటి బ్యూరో, రాష్ట్ర స్థాయి నేతల సమావేశం నిర్వహించారు. దీనిపై భిన్నస్వరాలు వినిపించాయి. ఎన్నికలను బహిష్కరించడమే మేలని కొందరు వాదించగా.. మరికొందరు వారితో విభేదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఉందని విమర్షిస్తుంది అధికార వైసీపీ. నామినేషన్లు, ఉపసంహరణ అయిపోయి, పోలింగ్ కు కొన్ని రోజులే ఉున్నప్పుడు బహిష్కరణ ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే బహిష్కరణ నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కౌంటరిస్తున్నారు టీడీపీ నేతలు. సింహం ఓ అడుగు వెనక్కి వేస్తే.. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూకుతుందని చెబుతున్నారు. ప్రత్యర్థి గుండెలను చీల్చుతుందని హెచ్చరిస్తున్నారు.

క్యాడర్లో భిన్నాభిప్రాయాల సంగతి పక్కనపెడితే.. చంద్రబాబు లాంటి నేత ఎన్నికల బహిష్కరణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా.. అనే చర్చ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ప్రెస్ మీట్ లో ఏం చెప్పినా.. అసలు విషయం ఏదో ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలంటేనే అలర్టైపోయి.. వ్యూహాలు రచించే చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటన చేయడంపై అన్ని పార్టీల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఏ స్థాయి ఎన్నికల్ని అయినా చాలా సీరియస్ గా తీసుకునే అతి కొద్ది మంది పొలిటీషియన్లలో చంద్రబాబు ఒకరు. గెలుపోటముల్ని కూడా ఆయన సమానంగా చూస్తారని చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా క్యాడర్ కు, ప్రజలకు టచ్ లోనే ఉంటారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారంటే.. ఏదో వ్యూహం ఉండే ఉంటుందని కొందరు టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు.

చంద్రబాబు క్యాడర్ అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించారన్న విమర్శల్లో కూడా నిజం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి. కొందరు నేతలు మొదట్నుంచీ అసంతృప్తితో ఉన్నారని, అలాంటి వాళ్లే ఇప్పుడు బహిష్కరణ సాకుతో అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. వైసీపీతో టచ్ లో ఉన్న కొందరు నేతలు, టీడీపీలోనే ఉండి కోవర్టులుగా పనిచేస్తున్న మరికొందరు నేతలు.. బహిష్కరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇంతకూ పరిషత్ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం టీడీపీకి రాజకీయంగా లాభం చేస్తుందా.. నష్టం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news