చెన్నైలో రెడ్ అలెర్ట్.. 2015 తర్వాత ఇదే భారీ వర్షం

-

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెన్నై నగరం అతలాకుతలం అయింది. తాజాగా చెన్నైలో రెడ్ అలెర్ట్ విధించారు. బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితులతో చెన్నై నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం మొత్తం నీట మునిగింది.  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్లను రద్దు చేశారు. నగరంలో కొరత్తూర్, పెరంబూరు, గిండి, పెరంగుడి ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి.

వర్షాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ నగరం మొత్తం పర్యటించారు. నీటమునిగిన ప్రాంతాల్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజల్ని, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు జలాశయాలు నిండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఐఎండీ వివరాల ప్రకారం.. నగరంలోని నుంగంబాక్కంలో అత్యధికంగా 207మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2015 తర్వాత ఈ స్థాయిలో వానలు కురవడం ఇదే ప్రథమం అని వాతావరణ శాఖ తెలుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news