కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉంటేనే సాధ్యం అవుతోంది. డబ్బులు పోసి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించే స్థితిలో కామన్ మ్యాన్ లేడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్‌లాక్ 4లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. దీని కోసం అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ ను సిద్ధం చేస్తోంది. అన్‌లాక్ 4లో మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ కేంద్రం మెట్రో సర్వీసులకు అనుమతిస్తే, హైదరాబాద్ మెట్రో కూడా పరుగులు పెట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఆర్టీసీ బస్సులు మళ్ళీ రోడ్లెక్కి అవకాశం కూడా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాధికారంపైనే ఆధారపడి ఉంటుంది. కాగా, కేంద్రం ఇచ్చే గైడ్‌లైన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్తేనే.. హైదరాబాద్‌లో ఆర్టీసీ సర్వీసులు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.