కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేశ వస్త్రాన్ని బహూకరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇదిలా ఉంటే.. నిన్న సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు.
సీజేఐగా ఎన్వీ రమణ మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన చెప్పాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి. అదే అంశాన్ని వివరిస్తూ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెబుతూ.. పదవీ విరమణకు ముందు ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదని స్పష్టం చేసారు. తన వీడ్కోలు ప్రసంగంలో అన్ని అంశాలను చెబుతానంటూ ఆసక్తి పెంచారు.