మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో వివిధ కార్యక్రమాల అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రై రేషన్ పంపిణీ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదన్నారు సీఎం జగన్. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తిస్తున్నారని సీఎం జగన్ వెల్లడించారు.
అంతేకాకుండా.. వారందరికీ కూడా పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని, పౌష్టికాహారం ఇచ్చే బాధ్యతను మహిళా, శిశుసంక్షేమ శాఖ చేపట్టాలన్నారు సీఎం జగన్. ప్రతి నెల గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని, జీవన శైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. వ్యాయామాలపై క్యాంపులు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.