మున్సిపాలిటీలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని.. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులను సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్…. సమర్ధవంతంగా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
విజయవాడలో కాల్వల సుందరీకరణ పైన నివేదిక ఇవ్వాలన్న సీఎం… పంటకాల్వల్లో చెత్త , ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్న సీఎం… మ్యాపింగ్ చేసి కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, అక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. సమగ్రమైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగలుతామని.. ఇందులో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. అందుకే జీతాలు పెంచామని.. ఈ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని 50శాతం పెంచిందని గుర్తు చేశారు.