ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23వ తేదీన తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదీన ఉదయం గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద నిర్మితమైన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం పేరూరు నుంచి హెలికాప్టర్లో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వెళ్తారు.
ఇనగలూరు వద్ద రూ. 700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అపాచీ పాదరక్షల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆపై హెలికాప్టర్లో తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గాన విమానాశ్రయం పక్కనే ఉన్న వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్-1 ను సందర్శిస్తారు. ఆ ప్రాంగణంలో టిసిఎల్ పరిశ్రమకు సంబంధించిన అనుబంధ యూనిట్లో ప్రారంభోత్సవం, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి తిరుపతి విమానాశ్రయం చేరుకుని 2:40 గంటలకు విమానంలో గన్నవరం బయల్దేరి వెళతారు.