ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి కర్తవ్య బోధ చేయనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు. గడప గడపకు కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమంపైనా సీఎం జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం తరువాత కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిట్టింగ్ స్థానాలపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి స్థానాల మార్పునకు జగన్ నిర్ణయించారని అంటున్నారు.
ఇందులో భాగంగా సీట్ మార్పు శాసనసభ్యులకు జూన్ వరకు కొంత టైం ఇచ్చే అవకాశం కూడా లేకపోలుదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సర్వేల ఆధారంగా సమాచారం తెప్పించుకున్న జగన్ 30 మంది ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్ ఇచ్చే విషయంలో డౌట్ గా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నారు. ఏప్రిల్ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై ఒక నిర్ణయానికి వస్తానని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. దీంతో ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్ ఏంటనే దానిపై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నారు పార్టీ నేతలు.