తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 11 లక్షల పోడు భూముల క్రమబద్ధీకరణ చేస్తున్నామని వెల్లడించారు. పోడు భూముల పంచాయతీని తీరుస్తామని, పోడు భూముల రైతులకు సమస్యల పరిష్కరిస్తామన్నారు. అయితే.. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ముచ్చటేలేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతామని తేల్చి చెప్పారు కేసీఆర్. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలు, నేతలంతా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని పక్క పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్.
టీఆర్ఎస్ నేతలతో ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరు టచ్ లోకి వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. తన బిడ్డ కవితను కూడా పార్టీ మారమని అడిగారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తే ఆ విషయం తన దృష్టికి తేవాలని, ఒకవేళ చెప్పకపోయినా తనకు తెలిసిపోతుందని అన్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ నేతలు పార్టీ మారాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్నది తనకు తెలిసిపోతుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏమైనా సమస్యలుంటే మంత్రి కేటీఆర్కుగానీ ప్రగతి భవన్కు గానీ వచ్చి చెప్పుకోవాలని చెప్పినట్లు సమాచారం.