కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తదితరులున్నారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు మూడు వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనులు చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం పైభాగాన డోమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. డోమ్‌ల కాంక్రీట్ పనులు పది రోజుల్లో పూర్తి కానున్నాయి.
అలాగే సచివాలయ భవనం లోపల అన్ని రకాల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. సచివాలయం వెనక భాగంలో గుడి కోసం 1500 గజాల్లో, చర్చి కోసం 500 గజాల్లో, మసీదు కోసం 1500 గజాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి కూడా 90 శాతానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కల్లా కొత్త సచివాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. రోడ్లు భవనాల శాఖ సచివాలయ పనులన్నింటిని పూర్తి చేసి జనవరిలో సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు అప్పగించనుంది. అయితే కొత్త సెక్రటేరియట్ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.