కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు చేసిన ఉద్యమంపై కేంద్రం వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా కేంద్రం మార్చేసిందని, రైతులను ఇబ్బందులకు గురి చేశారని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ… నేను కూడా రైతు ఉద్యమంలో పాల్గొన్నానని, నా విషయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు.
నన్ను కూడా స్టేడియంలో నిర్బంధించారని, కొన్ని రోజుల పాటు నేను కూడా స్టేడియంలోనే వున్నానన్నారు. రైతు ఉద్యమాన్ని అణచేయడానికి ఇదో రకమైన ఎత్తుగడ అని నాకు అప్పుడే అర్థమైంది అని వివరించారు కేజ్రీవాల్. రైతు ఉద్యమం కేవలం స్టేడియాలకు మాత్రమే పరిమితమైందన్న వాదనలు కూడా అప్పట్లో వచ్చాయని, వాటిని నిర్ద్వద్వంగా తోసిపుచ్చానని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. స్టేడియాలను జైళ్లగా మార్చనీయమని, దానిని అడ్డుకొని తీరుతామని చెప్పామన్నారు. ఆ సమయంలో చాలా కోపం వచ్చిందని, రైతులకు అండగా నిలిచామని గుర్తు చేసుకున్నారు కేజ్రీవాల్.